Cyclone Montha: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా మారి, తీరం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుపాను ప్రస్తుతం మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి 140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ సమీపంలో ఈ రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తీవ్రత, ప్రభావం, మరియు హెచ్చరికలు
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల ప్రభావం కాకినాడకు 80-90 కిలోమీటర్ల పరిధిలో తీవ్రంగా ఉండొచ్చు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, టవర్లు, చెట్లు పడిపోవడం, పూరిళ్లు ధ్వంసం కావడం వంటి నష్టం జరగవచ్చు. కాకినాడ పోర్టుకు ‘గ్రేట్ డేంజర్ సిగ్నల్’ 10వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు, అంటే తుపాను పోర్టుకు చాలా దగ్గరగా లేదా దాని మీదుగా తీరం దాటే ప్రమాదం ఉందని అర్థం. అందుకే పోర్టు కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిపివేయాలని, ఓడలను సముద్రంలో 150 నాటికల్ మైళ్ళ దూరం వరకు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
Also Read: Nara Lokesh: ముంచుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్.. ప్రభుత్వ సన్నద్ధతపై మంత్రి లోకేష్ సమీక్ష
భారీ వర్షాలు, వరద ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించవచ్చు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచన ఉంది. కొన్ని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో దాదాపు ఒక మీటరు ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
చేపల వేటపై నిషేధం
తుపాను ప్రభావం దృష్ట్యా, మత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు గట్టిగా హెచ్చరించారు. కాకినాడ (10), విశాఖ, గంగవరం (9), మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణ, వాడరేవు (8) వంటి ప్రధాన ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం మరియు విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను తప్పక పాటించాలని కోరారు.

