AP News

AP News: జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతు బలి.. ఏడుగురు వైసీపీ నేతల అరెస్ట్

AP News: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ నాయకులు చేసిన ఒక పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ముందు ఒక మేకపోతును బలి ఇచ్చి, ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, ఆ ఫ్లెక్సీపై “రప్పారప్పా” అంటూ ఇతరులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రాసి సోషల్ మీడియాలో వీడియోలు వదిలారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగించింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. శనివారం ఉదయం చోడవరం గ్రామానికి చేరుకుని, ఈ ఘటనకు బాధ్యులైన ఏడుగురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అరాచక పనులకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీల ముందు జంతువులను బలి ఇచ్చి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ఉత్సాహంతో ఇలాంటి పనులు చేసి యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని ఎస్పీ గారు తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *