Seetakka: అంగన్వాడీలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీతక్క

Seetakka: రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను ఆమె స్వయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. “అంగన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఇందిరా గాంధీ ఆరంభించిన ఐసీడీఎస్ సేవలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సేవలకు ఆమె ప్రాణం పోశారు. ఈ ఆలోచన మొదట తెలంగాణ నేల నుంచే పుట్టింది,” అని సీతక్క గుర్తుచేశారు.

1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన అంగన్వాడీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని మంత్రి పేర్కొన్నారు. “అంగన్వాడీ హెల్పర్‌ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఉన్న ప్రతి మహిళ ఇందిరా గాంధీ చలువే. ఆమెకు ప్రతి మహిళ రుణపడి ఉండాలి,” అని సీతక్క అన్నారు.

కొత్తగా నియమితులైన సూపర్వైజర్లకు మంత్రి మార్గదర్శనం చేస్తూ — “మీ సేవలను కేవలం పరిపాలనా పనులకే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్య, పౌష్టికాహారం అందించడంలో చురుకుగా ఉండండి. అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా మారాలి” అని సూచించారు

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం 57 రకాల ఆట వస్తువులు, యూనిఫాంలు అందిస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గర్వంగా తెలిపారు. “మన దేశ భవిష్యత్తు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంది. కాబట్టి ప్రతి సూపర్వైజర్ తన వృత్తి ధర్మాన్ని నిబద్ధతత పాటించాలి,” అని పిలుపునిచ్చారు

అదే సమయంలో సీతక్క, తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. త్వరలోనే 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలు చేపట్టబోతున్నామని మంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *