seetakka: ఆదివాసీల హక్కుల విషయంలో మావోయిస్టులు చేసిన ఆరోపణలకు తెలంగాణ అటవీ శాఖ మంత్రి సీతక్క బదులిచ్చారు. ఆదివారం ములుగు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె, “నాకు నా మూలాలు తెలుసు. నేను ఎప్పటికీ ఆదివాసీ పక్షాన నిలబడతాను. ఎవరు ఏం చెప్పినా వాస్తవాల ఆధారంగానే మాట్లాడాలి” అని వ్యాఖ్యానించారు.
జీవో 49పై తన స్థానం స్పష్టం చేసిన సీతక్క
“ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే జీవో నంబర్ 49ని నేను మొదటినుంచే వ్యతిరేకించాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించాను. అడవుల్లో ఆదివాసుల జీవనవిధానానికి విఘాతం కలగకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు నేను, మంత్రి కొండా సురేఖ కలిసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం,” అని తెలిపారు.
కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో కొందరు అధికారులు మాత్రమే నిబంధనలు అతిక్రమిస్తున్నారని, మిగిలిన అధికారులు ఆదివాసీలను ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేశారు.
మావోయిస్టుల లేఖపై కౌంటర్
అంతకుముందు మావోయిస్టులు మంత్రి సీతక్కకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఒకప్పుడు ఉద్యమ కార్యకర్తగా పనిచేసిన ఆమె, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి ఆదివాసీల హక్కులను విస్మరించారని విమర్శించారు. ముఖ్యంగా కుమురం భీమ్ జిల్లా పరిధిలో 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు జీవో 49ను వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం జీవో తెచ్చారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై వెంటనే స్పందించిన సీతక్క, “ఆదివాసీల హక్కుల పరిరక్షణకు నేను ఎప్పటికీ ముందుండేను. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం తరఫున నా వంతు కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.