Seeta Rama Kalyanam: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. శ్రీ సీతారామ దేవస్థానంలో లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన ‘శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం’ ఇప్పుడే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మహాగ్రూప్ ఛానల్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ, పద్మ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహావేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు. సాయంత్రం 5 గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కళ్యాణోత్సవం కోసం సీతారామపురం గ్రామాన్ని పెళ్లి కుమార్తెలా ముస్తాబు చేశారు. పచ్చని తోరణాలు, పూల పందిళ్లు, మంగళ వాయిద్యాల సందడి నడుమ రామయ్య పెళ్లి వేడుక కన్నుల పండువగా సాగుతోంది. మహాభక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను భక్తులందరికీ చేరువ చేస్తోంది. రాత్రి 10 గంటల వరకు సాగే ఈ కళ్యాణంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తున్నారు. భక్తులందరికీ సీతమ్మ వారి తలంబ్రాలు, స్వామివారి దర్శనం సులభంగా లభించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఆధ్యాత్మికతతో పాటు ఈ వేడుకలో సాంస్కృతిక సందడి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ కళాకారులచే ప్రదర్శిస్తున్న హరికథలు, భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. లోక శాంతిని కోరుతూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వంశీకృష్ణ దంపతులు తెలిపారు. కళ్యాణం ముగిసిన వెంటనే వేలాది మంది భక్తుల కోసం భారీ ఎత్తున మహా అన్న ప్రసాద వితరణ కూడా సిద్ధంగా ఉంది.
