Narayana

Narayana: అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం: మంత్రి నారాయణ

Narayana: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి కీలకమైన రెండో విడత భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ అమరావతి మండలంలోని యండ్రాయిలో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భూ సమీకరణపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రామ సభలో స్థానిక రైతులతో సమావేశమై, భూమి సమీకరణ ప్రక్రియ, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

మంత్రి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం లభించింది. యండ్రాయి గ్రామానికి చెందిన నంబూరి బలరాం తన 4 ఎకరాల భూమిని రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారు. ఆయన వద్ద నుంచి పొలం పత్రాలను ఎమ్మెల్యే సమక్షంలో మంత్రి నారాయణ స్వీకరించారు.

Also Read: TG High Court: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే పొడిగింపు.. జనవరి 29 వాయిదా!

మంత్రి మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాజధాని నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. “ఆ సమయంలో భూములు సరిగా సిద్ధం కాక, వర్షాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు,” అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

రెండో విడతలో రైతుల నుంచి లభించే 7,000 పైగా ఎకరాల భూమిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపడతామని చెప్పారు. అలాగే, గత భూ సమీకరణలో పాటించిన విధానాన్ని ఇదే విధంగా అమలు చేస్తామని, ట్రంక్ రోడ్లు, ప్రధాన రహదారులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నాలుగు, ఆరు లైన్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం వచ్చే ఏడాది లోపు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల సృష్టి, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ వృద్ధికి దోహదపడే విధంగా భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *