SC Categorization: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు కీలక ఘట్టమైన తొలి జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ఆమోదించారు. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ బిల్లులో ఉన్న అంశాల వారీగా పేర్కొంటూ జీవోను జారీ చేసింది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో గెజిట్‌ను అధికారులు విడుదల చేశారు.
SC Categorization: రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు. విద్య, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ గ్రూపుల వారీగా ప్రాధాన్యం కల్పిస్తారు. అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్-ఏగా, మధ్యస్తంగా లబ్ధిపొందిన కులాలను గ్రూప్-బిగా, మెరుగైన ప్రయోజనాలు పొందని కులాలను గ్రూప్-సీలో చేర్చినట్టు ఎస్సీ వర్గీకరణ జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది.
SC Categorization: గ్రూప్-ఏలో ఉన్న వారికి 1 శాతం, గ్రూప్-బీలో ఉన్న వారికి 9 శాతం, గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతంగా మొత్తం 15 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జీవో విడుదల చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గుర్తింపును దక్కించుకున్నది.