Sathya Sai Baba: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం రోజున అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల వేద మంత్రోచ్చారణలు, వేలాది మంది భక్తుల సాయి నామస్మరణతో పుట్టపర్తిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వెండి రథోత్సవం నేత్రపర్వం
ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వెండి రథోత్సవం. ఈ రథం ఏకంగా 31.8 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఈ రథంపై 9.2 కిలోల బంగారంతో రూపొందించిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రథం తయారీకి ఏకంగా 180 కిలోల వెండిని, బంగారు పూత కోసం కిలో బంగారాన్ని ఉపయోగించారు. గతంలో ఏటా వేణుగోపాలస్వామి రథోత్సవం మాత్రమే నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నుంచి కొత్తగా సత్యసాయి రథోత్సవాన్ని కూడా ప్రారంభించడం విశేషం.
సాయికుల్వంత్ మందిరం నుంచి సత్యసాయి, వేణుగోపాలస్వామి, సీతారామ, హనుమాన్ ఉత్సవ విగ్రహాలను సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, వేద పండితులు భక్తిశ్రద్ధలతో బయటకు తీసుకువచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని పులకించిపోయారు.
విశ్వశాంతి కోసం సామూహిక వ్రతం
శత జయంత్యుత్సవాల సందర్భంగా విశ్వశాంతిని కాంక్షిస్తూ మహాసమాధి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 1,100 జంటలు కలిసి సామూహికంగా సత్యనారాయణ వ్రతం ఆచరించాయి. మంగళవారం రాత్రి సత్యసాయి బాబా తెప్పోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Hyper Aadi: రాజమౌళి దేవుడిని అవమానించలేదు: హైపర్ ఆది
హాజరుకానున్న ప్రముఖులు
ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానుండడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (నేడు) పుట్టపర్తికి చేరుకుంటారు. ఉదయం 9.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి వెళతారు.

ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పిస్తారు. ఉదయం 10.30 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో జరిగే ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. బాబా జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ రూ.100 నాణెం మరియు నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే హాజరైన ప్రముఖులు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (నేడు), ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీనటి ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుట్టపర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

