Satya Prasad: ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు, మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు పలువురు “మతిభ్రమించి మాట్లాడుతున్నారు” అంటూ విమర్శించారు. చరిత్ర తెలిసిన వారికి ఇలాంటివి చెప్పాల్సిన అవసరం లేదని, చరిత్ర హీనుల గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి అనగాని మాట్లాడుతూ, “జగన్ మోహన్ రెడ్డి నిజంగా ప్రజాహితం కోరుతుంటే అసెంబ్లీకి ఎందుకు రారు? ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేకే సభకు రాలేకపోతున్నారు,” అని ఎద్దేవా చేశారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 13 నెలల కాలంలో 56 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారని గుర్తు చేశారు. దీనితో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజల మధ్యకు ఒక్కసారి కూడా రాలేదని ఆరోపించిన మంత్రి అనగాని, “ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో కలహాలు రెచ్చగొట్టేందుకు పర్యటనలు చేస్తున్నారు,” అన్నారు. ఏడాది క్రితం మరణించిన వ్యక్తిని పరామర్శించేందుకు వచ్చిన జగన్, అటుగా మరో ముగ్గురు మరణించేందుకు కారణమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంటే, దానిపై మాట్లాడే మాట లేక వైసీపీ నేతలు తేలిపోయారని అన్నారు. “ఒకప్పుడు వై నాట్ 175 అని నినదించిన వారు ఇప్పుడు 11 సీట్లకు పడిపోయారు. ఇప్పుడు మాత్రం ‘బతికితే చాలు’ అనే స్థితికి వచ్చారు,” అని ఎద్దేవా చేశారు. ఇక ప్రజలు ఇకపై వైసీపీని నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు.