Satya Kumar: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అబద్ధ ప్రచారాలకే పరిమితమైందని ఆరోపించారు. “వాళ్ల భాష, ప్రవర్తన రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వేలాదిమందితో వెళ్లి పరామర్శ చేయడమేనా? లేక అది ఒక రకమైన దండయాత్రేనా? వాళ్లే దీన్ని సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ పర్యటనలకు అనుచిత సంఘటనలు వారాంతం కావడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని అన్నారు. “ఎక్కడికెళ్లినా కొట్లాటలు, రాళ్ల దాడులు, వికృత భాషా ప్రయోగాలు, కార్యకర్తలపై కార్లతో దాడులు – ఇవే కనిపిస్తున్నాయి,” అని మండిపడ్డారు.
“చంపేసిన తర్వాత ‘మా కార్యకర్తే కదా, మీకేం నొప్పి?’ అనే ప్రశ్నలు అడగడం బాధ్యతా రాహిత్యానికి ఉదాహరణ” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పరిహారం ఇచ్చామని చెప్పి తప్పుదారి పట్టించడం కూడా అమానవీయమని అన్నారు.
ఇక ఆరోగ్య రంగంలో చేపట్టిన పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సుల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. అదనంగా, 860 బైక్‌ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు వెల్లడించారు.