Satavahana College: విజయవాడలోని శాతవాహన కళాశాల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న పరిణామాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వారం రోజులుగా ఈ వ్యవహారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. భూమి కబ్జా ఆరోపణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, న్యాయపోరాటం, రాజకీయ ఆరోపణలు ఇలా అనేక కోణాల్లో ఈ సంఘటన తలెత్తింది. శాతవాహన కళాశాల వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా అక్కడకు వస్తున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారే సూచనలతో పోలీసులు బందోబస్తు పెంచారు.
ఈ వివాదంలో ముఖ్యంగా నిలిచింది టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేసిన ఫిర్యాదు. ఆయన ఆరోపణల ప్రకారం, కళాశాల భూముల్లోకి కొందరు అక్రమంగా ప్రవేశించారు. అంతేకాకుండా, సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు ప్రజాపతి రావు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సుప్రీంకోర్టులో విత్‌డ్రా పిటిషన్ దాఖలు చేసినట్లు ఆరోపించారు. ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ భవనాలను కూల్చివేసిన ఘటనపై బోయపాటి శ్రీకృష్ణ, వంకాయలపాటి శ్రీనివాస్, రమా సత్యనారాయణ సహా 10 మందిపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఫిర్యాదు జరిగింది. బోయపాటి శ్రీనివాస అప్పారావుపై కూడా కేసు నమోదైంది.
దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యుడిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్, కాలేజీ భూములపై కోర్టు ఆదేశాలు అనుసరించకుండా భవనాలను కూల్చివేశారని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బోయపాటి శ్రీకృష్ణ మాట్లాడుతూ, ఈ నెల 3న కోర్టు ఆదేశాల మేరకు తమ భూమిని స్వాధీనం చేసుకున్నామని, సొసైటీకి సమాచారం ఇచ్చామని చెప్పారు. కాలేజీ రికార్డులు తమ వద్దే ఉన్నాయని కూడా పేర్కొన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కూడా రికార్డులు తమ వద్ద ఉన్నట్టు ఒప్పుకున్నారు. కానీ మాజీ ప్రిన్సిపాల్ సాంబి రెడ్డి మాత్రం భవనాల కూల్చివేతను తప్పుపట్టారు. విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతుందని వ్యాఖ్యానించారు.
Also Read: TDP: టీడీపీలో కొత్త సభ్యుల చేరికపై కఠిన మార్గదర్శకాలు
Satavahana College: ఈ ఉదంతంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ, కళాశాల భవనాలను రాత్రికి రాత్రి కూల్చివేశారని విమర్శించారు. ప్రభుత్వ అండతో భూమి కబ్జా జరుగుతోందని, 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై కిడ్నాప్ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై విద్యాశాఖ మంత్రి స్పందించాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా SRR కళాశాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ, అలాగే కనకదుర్గ థియేటర్‌ను బుల్డోజర్‌తో కూల్చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి నడుస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. శాతవాహన కళాశాల వివాదం రాజకీయంగా, న్యాయపరంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార పార్టీ, విపక్షాలు, విద్యార్థి సంఘాలు, సమాజసేవకులు – అందరూ తమదైన రీతిలో స్పందిస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.