Sankranthiki Vasthunam Review

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వచ్చారు సరే.. వెంకీ- అనిల్ నవ్వించారా.. లేదా?

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్పి.. అన్నట్టుగానే థియేటర్లను పలకరించింది వెంకటేష్ సినిమా. కాస్త వెటకారం.. మరికాస్త కన్ఫ్యూజన్ కామెడీతో అందర్నీ అలరించే అనిల్ రావిపూడి ఇంటిలిజెంట్ ప్రమోషన్స్.. గోదారి గట్టు అంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పాటలు.. ట్రైలరే ఇంత రంజుగా ఉంటే అసలు సినిమా ఇంకెంత ఉంటుందో అనిపించిన టీజర్స్, ట్రైలర్స్.. దిల్ రాజు కచ్చితంగా కొడ్తున్నాం ధీమా.. సంక్రాంతి సినిమాల్లో స్పెషల్ బజ్ క్రియేట్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాతి రోజు వచ్చేసింది సరే. ఇన్ని అంచనాలను నిలబెట్టుకుందా?ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం స్పెషల్ మూవీ అన్నట్టుగా సాగిన ప్రమోషన్స్ మధ్యలో ఈ సినిమా మెప్పించిందా? వెంకటేష్ తో ఇద్దరు భామలను కలిపి అనిల్ రావిపూడి చేసిన అల్లరి ఎలా ఉంది? అన్నీ తెలియాలంటే ఈ రివ్యూ చూసేయాల్సిందే.

కథ చెప్పుకోవడం ఎందుకు గానీ.. చిన్న లైన్ చెప్పుకుందాం. ఒక బిల్ గేట్స్ రేంజ్ సాఫ్ట్ వేర్ బిజినెస్ టైకూన్.. తెలంగాణ ఒక ఈవెంట్ కోసం వస్తాడు. అతన్ని బిజ్జు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఈ కిడ్నప్ నుంచి అతన్ని రక్షించడానికి ఒక టీమ్ రెడీ అవుతుంది. ఆ టీం కి కెప్టెన్ వెంకటేష్. అంతే.. ఇక కిడ్నాప్ నుంచి బాధితుడిని కాపాడారా? లేదా? ఈ లైన్ చుట్టూ ఫన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నమే సంక్రాంతికి వస్తున్నాం.

అనిల్ రావిపూడి అంటేనే చిన్న లైన్ చుట్టూ తిరిగే కథనం అనేది తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే దానికి భిన్నంగా ఏమీ ఉండదు. హాయిగా నవ్వుకుంటూ.. లాజిక్ ల జోలికి పోకుండా సినిమాని ఎంజాయ్ చేయగలిగేలా సినిమాల్ని తెస్తాడు అనిల్. ఇందులో కూడా అదేపని చేశాడు. వెంకటేష్ లాంటి హీరో ఈ సినిమాకి ప్లస్. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను డెవలప్ చేసినట్టు కనిపిస్తుంది. అనిల్ రావిపూడి చెప్పినట్టే ఫన్నీ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకులకు అందించారు.

ఫస్టాఫ్ సినిమా వేగంగా.. నవ్వుల మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కిడ్నాప్ గ్యాంగ్ కోసం హీరో టీం చేసే ప్రయత్నాల మధ్యలో వచ్చే సీన్స్ జబర్దస్త్ కామెడీ స్కిట్స్ లా ఉంటాయి. రొటీన్ అనిపిస్తాయి. అయితే, కాస్త ఫన్ క్రియేట్ అవుతుంది. ఫస్టాప్ జోష్ కంటిన్యూ చేసి ఉంటే సినిమా ఇంకో లెవెల్ లో ఉండేది అని సినిమా చూసేవారికి అనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunnam Twitter Review: వెంకీ “సంక్రాంతికి వస్తున్నాం”.. ఎలా ఉందంటున్నారు?

Sankranthiki Vasthunam Review: ఇక వెంకటేష్ కి ఇది టైలర్ మేడ్ రోల్. ఇలాంటి వాటిలో నటించడం అంటే.. కుమ్మి పారేస్తారు వెంకటేష్. సినిమా అంతా చాలాకాలం తరువాత వెంకటేష్ మార్క్ హ్యూమర్ కనిపిస్తుంది. ఇక వెంకటేష్ తో జోడీ కట్టిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరూ పోటీ పడినట్టు కనిపించారు. ముగ్గురి మధ్యలో వచ్చిన సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయించాయి. వెంకటేష్ కొడుకుగా చేసిన బుల్లోడు అదరగొట్టేశాడు.

టెక్నీకల్ గా సినిమా బావుందనిపిస్తుంది. ఫొటోగ్రఫీ క్లీన్ గా ఉంది. మ్యూజిక్ బావుంది. రెండు పాటలు విజువల్ గా ఆకట్టుకున్నాయి. గోదారి గట్టు మీద, మీను రెండు పాటలు మ్యూజికల్ గా ఎంత హిట్టో చెప్పక్కర్లేదు. విజువల్ గా కూడా ఈ రెండు పాటలు అంత బాగా వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి సినిమాలకి కేరాఫ్ ఎడ్రస్ కాబట్టి బండిని ఈజీగా లాగించారు. కానీ, అక్కడక్కడా ఫన్ సీన్స్ కాస్త అతిగా అనిపిస్తాయి. సినిమాని ఇంకొంచెం ట్రిమ్ చేయవచ్చనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా టెక్నీకల్ గా బాగానే ఉంది.

ఫన్ కోసం లాజిక్ లు ఆలోచించని వారికీ సంక్రాతికి వస్తున్నాం ఫుల్లుగా కిక్ ఇస్తుంది. లాజిక్ లు వెతుక్కునే వారి కి మాత్రం ఎదో ఉందిలే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంట్ మూవీస్ ని ఇష్టపడే వారికి సంక్రాంతికి వస్తున్నాం చాలా మంచి సినిమాగా అనిపిస్తుంది. కొత్త కథలు కావాలని కోరుకునేవారికి మాత్రం ఈ సినిమా నిరాశ పరిచే అవకాశం ఉంది.

చివరిగా.. సినిమా చూసేది వినోదం కోసమే కదా.. అనుకుంటే ఆ వినోదానికి లోటు ఉండదు. ఫ్యామిలీతో కల్సి థియేటర్ లో పండగ చేసుకోవాలనుకుంటే.. అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డా.. ఓవరాల్ గా హ్యాపీ పొంగల్ అనిపిస్తుంది!

గమనిక: ఈ రివ్యూ రివ్యూయర్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మహా న్యూస్ సినిమా చూడాలని లేదా చూడవద్దని ఎటువంటి సూచనలు చేయడం లేదు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *