Sanju Samson: సంజు శాంసన్.. ఎంతో ప్రతిభ..అద్భుత నైపుణ్యం ఉన్నా..అంతర్జాతీయ కెరీర్ లో సక్సెస్ కాలేకపోయాడు. అయినా అతనికి వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అరంగేట్రం చేసిన దాదాపు పదేండ్లకు సంజుకు పట్టిన గ్రహణం వీడింది. ఇన్నేండ్ల తర్వాత తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శిస్తున్నాడు. డర్బన్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించాడు. అలవోకగా సిక్స్‌లు, ఫోర్లు బాదేసిన శాంసన్.. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా రెండు శతకాలు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు.
Sanju Samson: సంజు దంచేశాడు. అంచనాలను అందుకుంటూ.. తన ప్రతిభకు న్యాయం చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. డర్బన్ లో జరిగిన తొలి టీ20లో భారత్ ఇన్నింగ్స్‌లో సంజు శాంసనే హీరో. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టు భారీ స్కోరు చేయడంలో అతడిదే ప్రధాన పాత్ర. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన ఈ విధ్వంసకారుడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు దంచుడే దంచుడు. 50 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు బాదాడు . గత టీ20లో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై మెరుపు శతకం సాధించిన శాంసన్ అదే జోరు కొనసాగించాడు. అతడి పుల్, లాఫ్టెడ్ షాట్లను చూసి తీరాల్సిందే. రెండో ఓవర్లో మార్‌క్రమ్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో బౌండరీతో మొదలైంది శాంసన్ జోరు. చక్కని టైమింగ్‌తో కూడిన బలమైన షాట్లతో మైదానం నలువైపులా దంచికొట్టాడు. స్పిన్నర్ పీటర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు దంచేసిన ఆఫ్ సెంచరీ అందుకున్న ఆ తర్వాతా శాంసన్ దూకుడు పెరిగిందే తప్ప తగ్గలేదు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన సంజు.. మరో 20 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు.
Sanju Samson: కెప్టెన్ సూర్యఔటైనా.. సౌతాఫ్రికా పేసర్లు నియంత్రించాలని ప్రయత్నిస్తున్నా ఆగలేదు. తిలక్ వర్మ అండగా ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో సాగిపోయాడు. సిక్స్‌లు కొట్టడం ఇంత తేలికా అని అనుకునేట్లు షాట్లు ఆడాడు సంజు. శతకంతో కదం తొక్కిన సంజు శాంసన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్ శాంసన్. అతని కంటే ముందు గుస్తావ్ మెకియాన్, రొసోవ్, ఫిల్ సాల్ట్ ఈ ఘనత సాధించారు. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా శాంసన్ చరిత్రకెక్కాడు.
Sanju Samson: అంతకుముందు ఈ రికార్డు 106 నాటౌట్ తో డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డును కూడా సంజు శాంసన్ సమం చేశాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్‌గా రోహిత్ సరసన సంజు శాంసన్ నిలిచాడు. 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఈ రికార్డు డర్బన్‌లో శాంసన్ సమం చేశాడు. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా శాంసన్ మరో ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్, రొసోవ్ పేరిట ఉండేది. వీరిద్దరు 9 సిక్సర్లు సాధించారు. నేను ఎక్కువగా ఆలోచిస్తే కన్నీళ్లు వస్తాయి. ఈ క్షణం కోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ అంత సులువుగా రాలేదు. ఎంతో కష్టపడ్డాను. నేను కోరుకున్నది ఇప్పుడు దక్కింది అని చెబుతూ సంజు శాంసన్ ఎమోషనల్ అయ్యాడు.