IND vs SA: భారత క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా సంజు శాంసన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. నేడు (డిసెంబర్ 19, శుక్రవారం) దక్షిణాఫ్రికాతో జరగనున్న నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో సంజు ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
గిల్‌కు గాయం.. శాంసన్‌కు లైన్ క్లియర్!
బుధవారం లక్నో వేదికగా నాలుగో టీ20కి ముందు నెట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ పాదానికి గాయమైంది. దీంతో అతను ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, నాలుగో మ్యాచ్‌కు, ఐదో మ్యాచ్‌కు మధ్య కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో గిల్ కోలుకోవడం కష్టమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, గిల్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Raw vs Cooked Vegetables: వండకుండా పచ్చిగా తింటేనే ఆరోగ్యం.. ఆ 4 కూరగాయల రహస్యమిదే!
ఇదే ఆఖరి అవకాశం?
ఆస్ట్రేలియాతో రెండో టీ20 తర్వాత వరుసగా బెంచ్‌కే పరిమితమైన సంజుకు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. గిల్ కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నా అతడికే అవకాశాలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న తరుణంలో, సంజుకు అదృష్టం తలుపు తట్టింది. ఈ మ్యాచ్‌లో కనుక శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే, రాబోయే సిరీస్‌లలో అతడిని పక్కన పెట్టడం సెలెక్టర్లకు అంత సులభం కాదు.
గత మ్యాచ్‌ను మింగేసిన పొగమంచు
భారత్-సౌతాఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. లక్నోలోని ఏకనా స్టేడియంలో విజిబిలిటీ సున్నాకి పడిపోవడంతో అంపైర్లు రాత్రి 9:30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే బాధ్యత నేటి ఆఖరి మ్యాచ్‌పైనే పడింది.

