Sigachi: ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ ఎండీ అరెస్ట్

Sigachi: సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో, ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఈ అరెస్ట్ విషయాన్ని సిగాచి కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు అధికారికంగా తెలియజేసింది. అగ్నిప్రమాద ఘటనపై కొనసాగుతున్న విచారణలో భాగంగానే అమిత్ రాజ్ సిన్హాను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని, డిప్యూటీ గ్రూప్ సీఈఓ లిజా స్టీఫెన్ చాకో తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది.

ఈ ఏడాది జూన్ 30న పశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్లాంట్‌లో ఔషధ తయారీలో ఉపయోగించే మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్‌ను ఉత్పత్తి చేస్తారు.

ఈ ఘటనపై బీడీఎల్–భానూర్ పోలీసులు కంపెనీ యాజమాన్యంపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇంతకాలం ఎలాంటి కీలక అరెస్టులు జరగకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దర్యాప్తులో జాప్యంపై గత నెలలో తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా, విచారణాధికారిని కోర్టుకు పిలిపించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

హైకోర్టు జోక్యం చేసుకున్న కొద్ది రోజులకే సిగాచి ఎండీ అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించేందుకు సిగాచి యాజమాన్యం అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *