Samantha: నటి సమంత తండ్రి జోసెఫ్ శుక్రవారం కన్నుమూశారు. తండ్రితో గాఢానుబంధం ఉన్న సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మొదటి నుండి తండ్రి చాటు పిల్లగానే పెరిగిన సమంత… సినిమాల్లోకి రావడం, స్టార్ హీరోయిన్ గా ఎదగడమనేది చిత్రమనే చెప్పాలి. నటిగా తాను ఉన్నత స్థితికి చేరుకోవడానికి తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని సమంత చెబుతుండేది. అయితే… సెలబ్రిటీస్ నడుమ ఉండటం ఏమాత్రం ఇష్టం లేని జోసెఫ్ ఎప్పుడూ సమంతతో కలిసి ఏ సినిమా ఫంక్షన్ లోనూ పాల్గొనలేదు. సమంత, చైతు వైవాహిక జీవితం పట్ల కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే పరస్పర అంగీకారంతో వీళ్ళు విడాకులు తీసుకున్నారని తెలిశాక… కూతురుకు స్వాంతన కలిగిస్తూ మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. వీరి విడాకులు ప్రకటన రాగానే వీరి పెళ్ళి ఫోటోను పెడుతూ, ‘చాలా కాలం క్రితం ఓ కథ ఉండేది. కానీ ఇప్పుడది లేదు. కాబట్టి ఓ కొత్త కథను, కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలి’ అని పేర్కొన్నారు. ఆయన మాటలను సమంత ఏమేరకు మనసులోకి తీసుకుందో తెలియదు కానీ నాగచైతన్య మాత్రం శోభితా దూళిపాలతో కొత్త అధ్యాయ్యాన్ని ప్రారంభిస్తున్నాడు.
