Samantha: ఇటీవల సినిమాల్లో కనిపించకపోయినా, సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గత రెండున్నర సంవత్సరాలుగా వెండితెరకు విరామం తీసుకున్నా, దేశంలోని టాప్ హీరోయిన్లలో ఇప్పటికీ సమంత పేరు ముందు వరుసలోనే ఉంది. మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంపైనా, జీవితాన్ని కొత్త కోణంలో చూసుకోవడంపైనా దృష్టి పెట్టింది.
ఆమె ప్రస్తుతం సినిమా ఎంపికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పాత్రకు విలువ ఉంటేనే ఒప్పుకుంటోంది. ఒకవేళ నచ్చిన పాత్ర దొరకకపోతే సొంతంగా సినిమాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తూ, అదే ఆమె సొంత బ్యానర్ లో రూపొందుతోంది. నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: Spirit: స్పిరిట్ షూటింగ్ పై క్రేజీ అప్డేట్!
సినిమాలతో పాటు బ్రాండ్ల విషయంలోనూ సమంతలో పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు బ్రాండ్ల వెనుక కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండానే ప్రమోషన్ చేసిందని, కానీ ఇప్పుడు మాత్రం బాధ్యతతో ఆ దిశగా అడుగులు వేస్తానని ఆమె చెబుతోంది. గత ఏడాదిలోనే ఆమె 15 బ్రాండ్లను స్వచ్ఛందంగా వదులుకుంది. లక్షలాది మంది ఆమెను ఫాలో అవుతారన్న బాధ్యతతో, ఇప్పుడు ఎలాంటి ఉత్పత్తినైనా వైద్యులతో పరిశీలించి, హానికరం కాకపోతేనే ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తానని స్పష్టం చేసింది.
సమాజంపై తన ప్రభావాన్ని గుర్తించిన సమంత, మహిళల సాధికారత, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ వంటి అంశాలపై సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తోంది. “ఇప్పుడు నేను స్టార్ అనే భావన కన్నా, సమాజానికి బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నా” అని ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. నటిగా వచ్చిన మార్పు మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా ఆమె పరిణతి చెందిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

