Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును గతేడాది డిసెంబర్ 1న వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. అయితే ఇప్పుడు సినిమాల్లో తన పేరు మార్పుకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పెళ్లి తర్వాత తన భర్త ఇంటి పేరును తన పేరుకు జోడించాలని సమంత నిర్ణయించుకున్నట్లు సమాచారం.
గతంలో అక్కినేని నాగచైతన్యతో వివాహం జరిగిన సమయంలో సమంత కేవలం సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకుంది. కానీ సినిమాల టైటిల్ కార్డ్స్ విషయానికి వస్తే మాత్రం ఎప్పుడూ ‘సమంత’ లేదా ‘సమంత రూత్ ప్రభు’ అనే పేరునే కొనసాగించింది. అయితే ఈసారి మాత్రం ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సమంత స్వయంగా తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’పై దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో తన పేరును ‘సమంత నిడిమోరు’ అని ప్రదర్శించబోతున్నారట.
Also Read: Tammareddy: క్యాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు తమ సొంత పేరుతోనే కెరీర్ కొనసాగించడానికి మొగ్గు చూపుతారు, కానీ సమంత తన భర్తపై ఉన్న ప్రేమతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఈ మార్పును అధికారికంగా అమలు చేయనుందని సమాచారం. పెళ్లి తర్వాత ఆమెలో కనిపిస్తున్న కొత్త ఉత్సాహం, మెరుపు చూస్తుంటే ఆమె వ్యక్తిగత జీవితం ఎంత బాగుందో అర్థమవుతోంది. మరి ‘సమంత నిడిమోరు’గా ఆమె తన కెరీర్‌లో ఎలాంటి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
