ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అయితే, సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఒక్కటే మార్గమని బిష్ణోయ్ వర్గం హెచ్చరించినట్లు తెలుస్తోంది. 1999లో విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడాడు.
ఈ కేసులో కింది కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. దీనిని ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాంతో వారికి బెయిల్ వచ్చింది. బిష్ణోయ్ వర్గానికి ‘కృష్ణజింక’ దైవంతో సమానం. తాము పూజించే కృష్ణజింకను సల్మాన్ వేటాడి చంపాడని, అతడిని ఎలాగైనా చంపేస్తామని ఇదివరకే బిష్ణోయ్ వర్గం ప్రకటించింది. ఇటీవల సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి కాల్పులు కూడా జరిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బిష్ణోయ్ కమ్యూనిటీ అఖిల భారత అధ్యక్షుడు దేవేంద్ర బుధియా ఓ ప్రకటన చేశారు.
సల్మాన్ ఖాన్ తరపున ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ క్షమాపణలు చెప్పడంతో ఈ విషయంపై దేవేంద్ర బుధియా స్పందించాడు. “సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే బిష్ణోయ్ సంఘం దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. సోమి అలీ ఎలాంటి తప్పు చేయలేదు. అందువలన ఆమె క్షమాపణ అంగీకరించలేము. సల్మాన్ గుడికి రావాలి. ఆ తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాత అతడికి విధించే శిక్ష గురించి ఆలోచిస్తాం” అని బుధియా అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

