Sajjala: అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “దమ్ముంటే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి” అని సవాల్ విసిరారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చంద్రబాబు అంటున్నారని, కానీ తమ మంద బలంతో వైసీపీ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రైతుల కష్టాలపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు
ప్రస్తుతం రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను సజ్జల ప్రస్తావించారు. “యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారని సజ్జల అన్నారు.
ప్రజల దగ్గరకు వెళ్లాలంటే చంద్రబాబుకు భయం
ప్రజల దగ్గరకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మించి ఏదీ లేదని, ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.