Vemulawada: తెలంగాణ సంసృతి సంప్రదాయలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంగరంగా వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే ఒక వేములవాడ పట్టణంలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం అనవాయితీగా వస్తుంది. తంగేడు, గునక, చిట్టిచామంతి, పట్టు కుచ్చు, బంతి, చామంతి తీరొక్క పూలను కొనుగోలు చేసి నియమ నిష్టలతో బతుకమ్మను పేర్చుతారు. బతుకమ్మను పేర్చిన పిదప పసుపుతో గౌరమ్మను పూజించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా తమ నిత్య జీవితంలో కష్టసుఖాలను పాటలుగా మార్చి ఆడుతూ పాడారు. మహిళలు పలు కూడళ్లలో గుమి కూడి ఆటపాటలతో సంబరాలు నిర్వహించుకున్నారు.
వేములవాడ పట్టణంలోని మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పలో బతుకమ్మ ను నిమజ్జనం చేశారు.పోయిరా గౌరమ్మ… పోయిరావమ్మా… అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు… మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన సభప్రంగానానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జననాట్యా మండలి గాయకురాలు విమలక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలకు అభివాదం తెలిపారు.

