Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. గత ఏడాది ఆగస్టులోనే ఈ జంట అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. తాజాగా వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ వివాహం చేసుకోబోయే సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం సొంతంగా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికురాలైన సానియా, ముంబైలో పెంపుడు జంతువుల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక స్టోర్‌ను కూడా నడుపుతున్నారు. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు సానియా అత్యంత ఆప్త మిత్రురాలు కావడంతో, ఆ పరిచయం కాస్తా అర్జున్, సానియాల మధ్య ప్రేమకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉండటంతో పెద్దలు కూడా వీరి పెళ్ళికి పచ్చజెండా ఊపారు.
Also Read: ICC: బంగ్లాదేశ్‌కు ఐసీసీ గట్టి షాక్: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల వేదిక మార్పుకు నిరాకరణ!
తాజా సమాచారం ప్రకారం, ఈ వివాహ వేడుకలు మార్చి 3వ తేదీ నుంచి ముంబైలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 3, 4 తేదీల్లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు నిర్వహించి, మార్చి 5న ప్రధాన వివాహ క్రతువును జరిపించేందుకు ఇరు కుటుంబాలు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, క్రికెట్ ప్రపంచంలోని కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను చాలా ప్రైవేట్‌గా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అర్జున్ కెరీర్ పరంగా కూడా ప్రస్తుతం కీలక దశలో ఉన్నారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారిన ఆయన, కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. అటు క్రికెట్ మైదానంలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ 2026 సంవత్సరం అర్జున్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. సచిన్ స్వయంగా ఓ సందర్భంలో తన కుమారుడి వివాహ నిశ్చితార్థం వార్తలను ధ్రువీకరించడంతో, అభిమానులు ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పెళ్లి తేదీపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
