Sabarimala Gold Theft: శబరిమల ఆలయంలోని బంగారు తాపడాల బరువు తగ్గింపు కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), 476 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
బళ్లారిలో గోవర్ధన్ అరెస్ట్
ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టీ ఆలయం నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని అమ్మాడని సిట్ విచారణలో తేలింది. ఉన్నికృష్ణన్ వేరు చేసిన బంగారాన్ని కర్ణాటకలోని బళ్లారికి చెందిన రొద్దం జువెలర్స్ యజమాని గోవర్ధన్‌కు విక్రయించాడు. ఈ విషయాన్ని గోవర్ధన్ అంగీకరించడంతో, సిట్ అధికారులు అతడికి సమన్లు జారీ చేసి, అనంతరం అరెస్ట్ చేశారు. ఆ బంగారాన్ని నిల్వ ఉంచిన రొద్దం జువెలర్స్ దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు.
Also Read: Karnool Bus Accident: కర్నూలు బస్సు దుర్ఘటనలో వెలుగులోకి మరో సంచలన విషయం
2004-2008 మధ్య శబరిమల ఆలయంలో పూజారి సహాయకుడిగా పనిచేసిన ఉన్నికృష్ణన్, 1998లో ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాల గురించి తెలుసుకున్నాడు. బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన తర్వాత, 2019లో తాపడాలకు మెరుగులు దిద్దే పనిని దక్కించుకున్నాడు. ఆ పనిని సాకుగా చూపి, వాటిని చెన్నైకి తరలించి, అక్కడ బంగారాన్ని తొలగించి, ఆపై గోవర్ధన్‌కు విక్రయించాడు. తిరిగి అమర్చిన తాపడాల బరువు తగ్గడం ఆలస్యంగా బయటపడింది.
బంగారం అమ్మకం వ్యవహారంలో ఉన్నికృష్ణన్, గోవర్ధన్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ అధికారులు లోతుగా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌తో పాటు ఆలయ బోర్డు మాజీ అధికారి మురారీ బాబును కూడా సిట్ అరెస్ట్ చేసింది.
ఈ వ్యవహారంలో 2019లో బోర్డు సభ్యులుగా ఉన్నవారి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. శబరిమల ఆలయం నుంచి సుమారు 445 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిట్ ఈ కేసుపై మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ వివాదంపై విచారణ ఇన్ కెమెరా (గోప్యంగా) జరుగుతోంది.

