Guntur: కదులుతున్న రైలులో మహిళపై దాడి, అత్యాచారయత్నం చేసిన కేసును రైల్వే పోలీసులు కేవలం ఒక్క రోజులోనే ఛేదించారు. నిందితుడిని తెనాలిలో అరెస్టు చేశారు.
గుంటూరు పరిధిలో జరిగిన రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై జరిగిన దారుణ ఘటన కేసును రైల్వే పోలీసులు వేగంగా పరిష్కరించారు. సత్రగంజ్-చర్లపల్లి రైలులో ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు జొన్నలగడ్డ రాజారావు (సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడుకు చెందినవాడు) గా పోలీసులు గుర్తించారు.
అసలు ఏం జరిగింది?
రెండు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. గుంటూరు నుంచి చర్లపల్లి వైపు వెళ్తున్న రైలులో, సత్రగంజ్- పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని మహిళా బోగీలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ బోగీలో ఒక మహిళ ఒంటరిగా ఉంది.
నిందితుడు మొదట ఆమెపై దాడి చేసి, ఆమె బ్యాగ్, సెల్ ఫోన్‌ను లాక్కొన్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, నిందితుడు పెదకూరపాడు స్టేషన్ దగ్గర రైలు నుంచి దూకి పారిపోయాడు.
బాధితురాలు చర్లపల్లికి చేరుకున్న తర్వాత అక్కడ జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీసులు) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్‌లో ఈ మేరకు కేసు నమోదు చేశారు.
నిందితుడి అరెస్ట్:
కేసు నమోదు అయిన వెంటనే రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రైలు మార్గంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. విచారణలో, నిందితుడు దొంగిలించిన సెల్ ఫోన్‌ను సత్తెనపల్లిలో అమ్మినట్లు తేలింది. ఆ తర్వాత అతను తెనాలికి పారిపోయాడు.
పోలీసులు వెంటనే తెనాలిలో నిందితుడు రాజారావును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఈ రోజు (కోర్టులో) హాజరుపరిచే అవకాశం ఉంది. రైల్వే పోలీసులు కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.