Bus Accident: సంగారెడ్డి జిల్లా కంది వద్ద శనివారం ఒక భారీ బస్సు ప్రమాదం జరిగింది. మెదక్ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉండటంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం.. డ్రైవర్ బస్సును చాలా అజాగ్రత్తగా నడిపారు. ఈ ఘటన జరగడానికి అరగంట ముందే శివంపేట దగ్గర ఇదే బస్సు ఒక స్కూటీని కూడా ఢీకొట్టిందట. అయినా సరే, డ్రైవర్ తన తప్పు తెలుసుకోకుండా వేగంగా నడపడం వల్లే ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో కరెంటు లేకపోవడంతో బాధితులకు సరైన సమయంలో చికిత్స అందలేదు. ముఖ్యంగా సీటీ స్కాన్ చేయించుకోవడానికి బాధితులు అరగంటకు పైగా చీకట్లోనే ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలాంటి పెద్ద ఆస్పత్రిలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై రోగుల బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బస్సులో 60 మంది ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ప్రమాదం గనుక గట్టిగా జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
