RSS: దమ్ముంటే.. సీఎంకే సవాల్ విసిరిన ఆర్ఎస్ఎస్..

RSS: కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు మధ్యంతరంగా నిలిపివేసిన నేపథ్యంలో, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ప్రతిపక్ష నేత ఆర్. అశోక మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం హిట్లర్‌ తరహా పాలనను నడుపుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం” అని విమర్శించారు.

“హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి ప్రియాంక్ ఖర్గే – మీరు ఎప్పుడూ రాజ్యాంగం పుస్తకం జేబులో పెట్టుకుని తిరిగే మీ నాయకుడు రాహుల్ గాంధీకి పౌరుల హక్కులు కనిపించడం లేదా?” అని ఆయన ప్రశ్నించారు.

ఈ వివాదానికి కారణమైనది మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ. ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించడంతో ఈ తుఫాన్ ప్రారంభమైంది. ఆ లేఖ అనంతరం ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

అయితే ఈ ఉత్తర్వులపై ‘పునశ్చేతన సేవా సంస్థ’ అనే ఎన్జీవో హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే జారీ చేసింది. పాదయాత్రలు, సభలు, గుమికూడే కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

ఈ తీర్పుతో బీజేపీ ధైర్యం పొంది, సిద్ధరామయ్య ప్రభుత్వంపై రాజకీయ దాడి ప్రారంభించింది. “మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆర్ఎస్ఎస్‌ను పూర్తిగా బ్యాన్ చేయండి, ఆ తర్వాత జరిగే పరిణామాలను కూడా ఎదుర్కోండి” అని బీజేపీ సవాల్ విసిరింది.

ఇక సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *