RS 400 Crore Heist: కర్ణాటక, మహారాష్ట్ర, గోవా.. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన పాత 2000 నోట్లతో వెళ్తున్న రెండు కంటైనర్లు మాయమయ్యాయన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గతేడాది అక్టోబరులో జరిగినట్లు చెబుతున్న ఈ భారీ దోపిడీ వ్యవహారం, తాజాగా వెలుగులోకి రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కిడ్నాప్ కేసుతో బయటపడ్డ అసలు నిజం ఈ భారీ కుంభకోణం బయటపడటానికి ఒక కిడ్నాప్ కేసే కారణమైంది. మహారాష్ట్రకు చెందిన సందీప్ పాటిల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నెల రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. “మాయమైన ఆ 400 కోట్లు నీవే కొట్టేశావు.. ఆ డబ్బుకు బదులుగా మాకు 100 కోట్లు ఇవ్వు” అంటూ వారు తనను వేధించినట్లు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ‘కంటైనర్ల మాయం’ కథ బయటపడింది.
అడవి దారిలో ఏం జరిగింది? సందీప్ పాటిల్ చెబుతున్న వివరాల ప్రకారం.. గోవా నుంచి గుజరాత్‌లోని ఒక ఆశ్రమానికి ఈ నగదు తరలిస్తుండగా, కర్ణాటకలోని చోర్లా ఘాట్ అటవీ ప్రాంతంలో దోపిడీ జరిగింది. రద్దయిన ఈ రెండు వేల రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో మార్చుకోవడానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు ఎక్కడిది? ఆ కంటైనర్లు ఏమయ్యాయి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు: సంతోష్‌కు సిట్ నోటీసులు
పోలీసుల మధ్య భిన్నమైన వాదనలు ఈ కేసు విచారణలో రాష్ట్రాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర పోలీసులు: ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
కర్ణాటక పోలీసులు: తమ పరిధిలో ఇలాంటి దోపిడీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, కనీసం సీసీటీవీల్లో కూడా కంటైనర్లు కనిపించలేదని చెబుతున్నారు.
గోవా పోలీసులు: ఈ డబ్బు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.
రాజకీయ రంగు పులుముకున్న కేసు ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలించడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అసలు నిజంగానే దోపిడీ జరిగిందా? లేక కేవలం ఆర్థిక గొడవల వల్ల ఈ కథ అల్లారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఒక మిస్టరీలా మారి పోలీసులకు పెద్ద సవాలుగా నిలిచింది.
