Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులుగా ఉన్నవారందరికీ భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు, నిందితులపై మోపబడిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెల్లడించింది.
ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఈ తీర్పుతో పెద్ద ఉపశమనం లభించింది. కవితపై సీబీఐ మోపిన అన్ని చార్జీలను కోర్టు కొట్టివేసింది. ఆమెకు ఈ కేసులో ‘క్లీన్ చిట్’ ఇస్తూ న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై కూడా సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది.
విచారణ సంస్థలపై కోర్టు సీరియస్
ఈ కేసులో సీబీఐ తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు లేకుండానే నిందితులను ఈ కేసులో ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీబీఐ దాఖలు చేసిన భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, అందులో పేర్కొన్న అంశాలకు మద్దతుగా ఎటువంటి సాక్షులు లేదా వాంగ్మూలాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతోనే అరెస్టులు జరిగాయన్న వాదనలకు బలం చేకూర్చేలా కోర్టు వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
కేజ్రీవాల్, సిసోడియాలకు విముక్తి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను కూడా కోర్టు ఈ కేసు నుండి డిశ్చార్జ్ చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కూడా కేసు నిలబడలేదని కోర్టు అభిప్రాయపడింది. కేజ్రీవాల్‌ను ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండానే ఈ కేసులోకి లాగారని జడ్జి వ్యాఖ్యానించారు. మొత్తానికి, సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో రాజకీయ నాయకులకు పెద్ద విజయం లభించినట్లయింది.
