Telangana: రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం కలకలం సృష్టిస్తోంది. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి పీఎస్ పరిధిలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతులు బన్సీలాల్‌పేటకు చెందిన ప్రణయ్, బోయగూడాకు చెందిన అక్షిత్ గా గుర్తించారు. ఘటన చూసిన స్థానికులు కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులకు తెలిపారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఇద్దరు యువకుల మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమారుల మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.