Road Accident: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. మహారాష్ట్రలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు సహా మొత్తం నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవాడ-సోండో ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌లోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకోవడానికి మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు వెళ్లారు. చికిత్స అనంతరం తమ కారులో తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గమధ్యలో కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ఈ ప్రమాదంలో జాకీర్ భార్య సల్మా బేగం, ఆమె కుమార్తె శబ్రీమ్‌తో పాటు బంధువులైన ఆఫ్జా బేగం, సహారా అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారిని చికిత్స కోసం చంద్రపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో నిజాముద్దీన్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
