Road accident: ఐర్లాండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు తెలుగు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన చెరుకూరి సురేశ్ (26), ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) మృతి చెందారు.
వివరాలు:
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అయ్యప్పనగర్‌కు చెందిన చిట్టూరి సాయిబాబా ప్యూరిఫైడ్ వాటర్ పరికరాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత విద్య కోసం తన కుమారుడు భార్గవ్‌ను మూడు సంవత్సరాల క్రితం ఐర్లాండ్‌కు పంపించారు. భార్గవ్ సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు.
అదే విధంగా, పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన చెరుకూరి రామకోటయ్య కుమారుడు సురేశ్ కూడా ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం ఐర్లాండ్ వెళ్లాడు. అక్కడే భార్గవ్‌తో స్నేహం ఏర్పడింది.
ప్రమాదం వివరాలు:
జనవరి 31న రాత్రి, ఈ ఇద్దరు మరికొంతమంది స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ప్రయాణిస్తున్న సమయంలో భారీగా మంచు కురిసింది, దీంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అనంతరం కారు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదంలో భార్గవ్, సురేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన స్నేహితులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపితే తిరిగి వారి పార్థివ దేహాలు రావడం తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.