Road Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ దుర్మరణం పాలయ్యారు. రాజీవ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. మరో కారును తప్పించబోయిన డీఎస్పీ ప్రయాణించే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అడ్వర్టైజ్‌మెంట్ బోర్డును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కుకునూరుపల్లి మండలంలో జరిగింది.
Road Accident: మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్, డీఎస్పీ బీ జవహర్‌లాల్ (50) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజ్‌గోపాల్‌పేట గ్రామ శివారులో ఫైరింగ్ రేంజ్ శిబిరానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఇన్‌సర్వీస్ కానిస్టేబుళ్లకు నిర్వహించిన ఫైర్ టెస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని మేడ్చల్‌కు డీఎస్పీ జవహర్‌లాల్ తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం చిన్న కిష్టాపూర్ చౌరస్తా వద్ద అదే గ్రామం నుంచి ఒక్కసారిగా ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఓ కారు రాజీవ్ రహదారిపైకి వచ్చి హైదరాబాద్ వైపు తిప్పింది. దీంతో ఆ కారును తప్పించబోయిన డీఎస్పీ కారు సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పింది. హైవే పక్కనే ఉన్న పెద్ద అడ్వర్టయిజ్‌మెంట్ బోర్డును ఢీకొట్టింది.
Road Accident: ఈ ప్రమాదంలో డీఎస్పీ బీ జవహర్ తలకు, ఛాతీలో తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారి వెనుక నుంచి మరో వాహనంలో వచ్చిన మేడ్చల్ పీటీసీ సిబ్బంది వారిని ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామ శివారులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ డీఎస్పీ జవహర్ మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కుకునూరుపల్లి ఎస్ఐ పీ శ్రీనివాస్ తెలిపారు.