Road Accident: శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే జైపూర్ పరిసరాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అతివేగంగా వస్తున్న ఒక ఆడి కారు అదుపు తప్పి పాదచారులు మరియు రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, కనీసం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జైపూర్‌లోని జర్నలిస్ట్ కాలనీ ప్రాంతం, ఖరబాస్ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గప్‌చుప్ బండితో పాటు ఇతర స్టాళ్లపైకి దూసుకెళ్లింది. సుమారు 30 మీటర్ల దూరం వరకు కారు ఆగకుండా వెళ్లడంతో, మార్గమధ్యలో అడ్డువచ్చిన ప్రతి వస్తువు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో అక్కడున్న జనం భయంతో కేకలు వేస్తూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ప్రజలు అప్రమత్తంగా స్పందించి పరుగులు తీయకపోయి ఉంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని ఒక ప్రత్యక్ష సాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: World News: 2026 ఏడాదిపై బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా?
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వెంటనే గాయపడిన వారిని సమీపంలోని ఎస్.ఎం.ఎస్ (SMS) హాస్పిటల్ మరియు జైపురియా హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి నిలకడగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు.
ముహానా ఎస్‌హెచ్‌ఓ గురుభూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను, ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. నిందితులు జైపూర్ సమీప ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికలు మరియు పూర్తి దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
