Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో వారం కెప్టెన్‌గా కళ్యాణ్ కొనసాగుతున్నప్పటికీ, తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వచ్చిన కొత్త సభ్యులు ప్రేక్షకులకు, ఇంటి సభ్యులకు విసుగు తెప్పిస్తున్నారు. అవసరం లేకపోయినా చిన్న విషయాలను పెద్దవిగా చేసి, గొడవలకు దిగాలని చూస్తున్నారు.
నిన్నటి ఎపిసోడ్లో ఈ రచ్చ మరింత పెరిగింది. ముఖ్యంగా, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురికి మరో సభ్యురాలు రీతూ చౌదరికి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దివ్వెల మాధురి ఇంట్లో తనకి తానే పెద్ద మహారాణిలా ఫీల్ అవుతూ, మిగిలిన వారంతా వినాల్సిందే అన్నట్లుగా కొత్త రూల్స్‌ను ప్రకటించింది.
మాధురి ‘మహారాణి’ రూల్స్:
మాధురి విధించిన నిబంధనలు విని మిగిలిన సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆమె మాట్లాడుతూ, “రాత్రి లైట్లు ఆపిన తర్వాత బెడ్రూమ్లో ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్లాలి. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చాం. అలాగే, ఉదయం కూడా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్‌గా ఉండాలి. రాత్రిపూట మాకు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నాం” అని హుకుం జారీ చేసింది. ఈ రూల్స్ అందరికీ ఓకేనా అని ఇమ్మూ అడగ్గా, “ఓకేనా, ఓకే లేదా అనడానికి ఇక్కడ ఆప్షన్ ఏం లేదు” అని మాధురి బదులిచ్చింది.
Also Read: Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
మాధురి కామెంట్స్‌కు రీతూ చౌదరి వెంటనే స్పందించింది. “ఇదేమన్నా బిగ్ బాస్ రూలా?” అని ప్రశ్నించింది. దాంతో మాధురి కోపంతో ఊగిపోయింది. “బిగ్ బాస్ రూలా అంటున్నావేంటి? గొడవ పడదామనుకుంటున్నారా?” అంటూ రీతూపై అరిచింది.
రీతూ కూడా ఏమాత్రం తగ్గకుండా, “ముందు మీరు అరవకుండా మాట్లాడండి, ఎందుకు అరుస్తున్నారు? మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా?” అని సీరియస్ అయ్యింది. దానికి మాధురి ఆవేశంతో స్పందిస్తూ, తనకు బీపీ ఉందని, అందువల్ల అరుస్తానని మొండిగా చెప్పింది. వెంటనే రీతూ, “అయితే వెళ్లి ట్యాబ్లెట్ వేసుకోండి” అని కౌంటర్ ఇవ్వడంతో మాధురికి మరింత కోపం పెరిగింది.
మాధురి పదేపదే “లైట్స్ ఆపిన తర్వాత మాట్లాడటానికి వీల్లేదు, ఇది రూల్” అని వాదించగా, రీతూ “అలాంటి రూల్ ఇక్కడ లేదు, మేము మాట్లాడుకుంటాం. మీరు ఎవరు అది చెప్పడానికి?” అని గట్టిగా చెప్పింది. మాట ముదిరి, “నేను ఒప్పుకోను!” అని మాధురి అరిస్తే, “మీరెవరు ఒప్పుకోకపోవడానికి?” అని రీతూ ధీటుగా సమాధానం ఇచ్చింది. మాధురి “నా హెల్త్ ఇది” అంటూ పదేపదే చెబుతుంటే, “మీ హెల్త్ అయితే మీరు మూడింటి వరకూ ఎందుకు పడుకోలేదు?” అని రీతూ ఎదురు ప్రశ్నించింది.
చివరికి, “ఎక్కువ మాట్లాడకు ఏయ్!” అని మాధురి అనగా, “ఏయ్ గియ్ అంటే పడటానికి ఎవరూ లేరు ఇక్కడ, నా ఇష్టం నేను నవ్వుకుంటాను, మాట్లాడతాను” అని రీతూ స్పష్టం చేసింది. “ఏం మాట్లాడుతున్నావ్?” అని మాధురి అడిగితే, “తెలుగు మాట్లాడుతున్నాను” అంటూ రీతూ సెటైర్ వేసింది. దివ్య కూడా మాధురి రూల్స్‌ను వ్యతిరేకిస్తూ, ఎవరికైనా సమస్య ఉంటే కెప్టెన్‌కు చెప్పాలి కానీ ఇలా సొంతంగా రూల్స్ పెట్టకూడదని చెప్పింది. కెప్టెన్ కళ్యాణ్ కూడా “బెడ్రూమ్లో మాట్లాడకూడదనే రూల్ నేను పెట్టట్లేదు. స్లోగా మాట్లాడుకోండి, ఏమైనా సౌండ్ ఉంటే బయటికి వెళ్లి మాట్లాడుకోండి” అని సర్దిచెప్పారు.
మరోవైపు, హౌస్‌లో రమ్య తన ఫుడ్ పవర్‌ను ఉపయోగించి ఆర్డర్ చేసిన ఆహారం బిగ్ బాస్ పంపించాడు. ఈ ఆహారాన్ని రమ్య తాను ఎంచుకున్న సుమన్ శెట్టితో మాత్రమే పంచుకోవాలి. ఈ సందర్భంగా సంజన దొంగతనంగా ఫుడ్ తినడానికి ప్లాన్ చేసిందా అని అడగగా, రమ్య “దొంగపనులు చేస్తే మళ్లీ మెడలో బోర్డు వేస్తారు, అందుకే అలా కూర్చోకూడదు” అని చెప్పింది. తాను ‘సంజన 2.0’ అవుతానని అనుకున్నారా అంటూ రమ్య సరదాగా బదులిచ్చింది.