Rishabh Pant: భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడటంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. నిన్న మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్ తొలి రోజు ఆటలో పంత్ కాలి బొటనవేలుకు తీవ్ర గాయమైంది. వైద్యుల సూచనల మేరకు అతడు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది.
నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా పంత్‌కు గాయమైంది. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో బంతి పంత్ కుడి పాదాన్ని బలంగా తాకింది. వెంటనే అతడిని స్కాన్‌ల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ, “అవును, రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. నిన్న రాత్రి స్కాన్‌లలో అతడి బొటనవేలు విరిగినట్లు తేలింది. ప్రస్తుతం అతడు చాలా నొప్పితో ఉన్నాడు, కాబట్టి బ్యాటింగ్ చేసే అవకాశం లేదు” అని ధృవీకరించారు. బొటనవేలికి ఫ్రాక్చర్ కావడంతో కోలుకోవడానికి కనీసం 6 వారాల సమయం పడుతుందని తెలుస్తోంది.
Also Read: IND vs ENG: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు: ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు..!
పంత్ స్థానంలో ధృవ్ జురెల్
ఈ గాయంతో హై-ప్రొఫైల్ టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ భాగస్వామ్యం ముగిసింది. పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, పంత్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటుగా మారనుంది.

