rgv vs police

RGV VS Police: పోలీసుల వేట.. ఆర్జీవీ ఆట!

RGV VS Police: నేరము-శిక్ష ఈ రెండిటి మధ్య దూరం ఎంత ఉంటుందో తెలియాలంటే ఆర్జీవీ ఉదంతం ఒక్కటి సరిపోతుంది. ఒక వ్యక్తి చిన్న నేరం చేస్తే.. దానికి పోలీసులు విచారణకు పిలిస్తే వెళ్లకపోతే ఏమి జరుగుతుంది? ఆ టైం దాటిన ఒక గంటలోపు పోలీసు జీపు ఇంటి ముందు ఆగుతుంది. సదరు నిందితుడికి పోలీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అదే ఒక రాజకీయ నాయకుడిపై ఆరోపణలు వస్తే ఏమవుతుంది? కోర్టు.. బెయిలు.. క్వాష్.. ఇలా కథ నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంటుంది. మరి ఆ ఆరోపణలు వచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అనబడే ఆర్జీవీ అయితే ఎలా ఉంటుంది? కేసు.. నాలుగు ట్వీట్స్.. కోర్టు.. నాలుగు ట్వీట్స్.. పోలీసులు.. నాలుగు ట్వీట్స్.. సోషల్ మీడియాలో మోత. పోలీసులు వెతుకుతూనే ఉంటారు.. ఆర్జీవీ కవ్విస్తూనే ఉంటారు. స్టోరీ పార్ట్ 1.. 2.. 3..4.. నడుస్తూనే ఉంటుంది. 

ప్రజలకు అర్ధం కాని ఆట ఇది. తప్పు చేశారా లేదా అనేది తరువాత.. పోలీసుల దగ్గర కేసులు నమోదు అయితే దానికి సమాధానం చెప్పడం కోసం వారి వద్దకు వెళ్ళడానికే తీరిక లేదని చెబుతున్న ఆర్జీవీ.. సినిమాల్లో మాత్రం చాలా శ్రీరంగ నీతులు చెబుతారు. ఆఫ్ కోర్స్.. వర్మ సినిమాల్లో క్రైమ్ క్రీమే ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఆ క్రీమ్ నే ఇప్పుడు నిజజీవితంలో కూడా పోలీసులకు రుచి చూపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Sarada Peetham: తపస్సుకు దారేదీ? విశాఖ స్వాములోరికి తత్త్వం బోధపడినట్టే ఉంది

RGV VS Police: రాజకీయంగా నమోదు అయిన కేసుగానే పోలీసులు దీనిని భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే, గతంలో సినీనటి హేమ బెంగళూరు పార్టీ విషయంలో విడుదల చేసిన వీడియోలు ఎక్కడ తీశారో గంటల్లో తెలుసుకుని.. ఆమెను ట్రేస్ చేశారు. మరి రెండు రోజులుగా దాగుడుమూతలు ఆడుతున్న ఆర్జీవీ ఆచూకీ ఇంకా దొరకకపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ఆయన కనిపించడం లేదు. కానీ, కోర్టుల్లో మాత్రం పిటిషన్స్ వస్తూనే ఉన్నాయి. ముందస్తు బెయిల్ కోసం వరుసగా పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. నన్నేం చేయగలరు అంటూ సోషల్ మీడియా పోస్ట్స్ వస్తూనే ఉన్నాయి. నేను పారిపోలేదు. కనిపిస్తున్నానుగా అంటూ డిజిటల్ గా కనిపించి.. వినిపిస్తూనే ఉన్నారు. 

క్రైమ్ కథలు రాసిన అనుభవమో.. ఆ కథల కోసం సెలబ్రిటీ దర్శకుడి హోదాలో పోలీసు అధికారుల నుంచి నేర్చుకున్న తప్పించుకుని తిరగడం అనే టెక్నీక్స్ మహిమో కానీ.. వర్మ మాత్రం దొరకడం లేదు. నేను పారిపోలేదు అంటూనే అజ్ఞాత వాసిగా మారిపోయారు. నేను ఎవరినో తిడితే మీ మనోభావాలు దెబ్బతినడం ఏమిటి అని కంప్లైంట్ ఇచ్చినవారిపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. (మరి ఇది ఫిర్యాదు దారులను బెదిరించడం అవుతుందో లేదో చట్టం తెలిసిన వారు చెప్పాలి) కానీ, పోలీసులకు మాత్రం ఆయన ఆచూకీ తెలియడం లేదు. వర్మను అరెస్ట్ చేయాలని కాదు కానీ, నేరము.. చట్టము.. శిక్ష అందరికీ ఒకేలా ఉండాలి కదా. 

RGV VS Police: ఇదంతా చూస్తుంటే ఆర్జీవీకి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేవరకూ.. పోలీసులకు ఆయన ఆచూకీ తెలిసే అవకాశం లేదనిపిస్తోందని సామాన్యుల మాట. మా ఆర్జీవీ అంటే ఏమిటనుకున్నారు.. ఎవడికీ చిక్కడు.. ఏమీ చేయలేరు అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునే ఆట. మొత్తంగా చూసుకుంటే, ఆర్జీవీ కోసం పోలీసుల వేటకు నాలుగో రోజు. ఆర్జీవీ ఆట సినిమాకు నాలుగో ఎపిసోడ్. మనమందరం చూస్తూనే ఉందాం ఈ క్షణ క్షణ ఆర్జీవీ చరిత్ర!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *