CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్‌లతోపాటు మరో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కొత్త డిస్కమ్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకాలను నిర్వహించాలన్నది సీఎం ఆలోచన.
ఉచిత విద్యుత్ పథకాల కోసం ప్రత్యేక డిస్కమ్
రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, విద్యాసంస్థలకు ఉచిత కనెక్షన్లు వంటి పథకాలన్నింటినీ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ డిస్కమ్ రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా కవర్ చేయాలని అన్నారు.
పాత డిస్కమ్‌లు వాణిజ్య పద్ధతిలో ముందుకు
ఉత్తర (TG-NPDCL), దక్షిణ (TG-SPDCL) డిస్కమ్‌లను వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించాలని సూచించారు. వాటి పనితీరును మెరుగుపరచి జాతీయస్థాయిలో మంచి రేటింగ్ తెచ్చుకోవాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం.
ఇది కూడా చదవండి: Kingdom Twitter Review: హిట్ కొట్టిన విజయ్.. ‘కింగ్డమ్’ ట్విటర్ రివ్యూ
రుణ భారం తగ్గించండి
ప్రస్తుతం విద్యుత్తు సంస్థలు భారీ రుణ భారం లో ఉన్నాయని, కొన్ని రుణాలు 10% వడ్డీతో తీసుకున్నాయని తెలిపారు. ఇవన్నీ 6% వడ్డీకి రీ-స్ట్రక్చర్ చేయాలని ఆదేశించారు. డిస్కమ్‌ల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.
ప్రభుత్వ భవనాలపై సోలార్ విద్యుత్తు
విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సచివాలయానికి కూడా సోలార్ విద్యుత్తు అందుబాటులోకి తీసుకురావాలని, పార్కింగ్ అవసరాల కోసం సోలార్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఆదివాసీల కోసం ప్రత్యేక పథకం
“ఇందిర సౌర గిరి జలవికాసం” అనే పథకాన్ని రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రానున్న మూడేళ్లలో 2.10 లక్షల ఎస్టీ రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేసి, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్తు పంపుసెట్లు అందించాలన్నారు.
విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతోంది
2020లో 13,168 మెగావాట్లు ఉన్న విద్యుత్తు డిమాండ్, 2025 మార్చి నాటికి 17,162 మెగావాట్లకు చేరిందని అధికారులు సీఎం కు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వినియోగం 30 శాతం వరకూ పెరుగుతోందని తెలిపారు. ఈ డిమాండ్‌ను బట్టి రాష్ట్రాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించారన్నారు.