Revanth Reddy: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్ర నేతల కంటే కేసీఆర్ తెలంగాణకు వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని, ఆయన చేసిన నేరానికి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నాడు ప్రజా భవన్‌లో జరిగిన కృష్ణా, గోదావరి నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, నీటి హక్కుల విషయంలో ఎవరికీ తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఎంతటి వారొచ్చినా ఎదురించి నిలబడతానని, దేవుడే అడ్డు వచ్చినా ప్రజల పక్షాన నిలబడతానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విధంగా తమ ప్రభుత్వం విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శల వర్షం:
299 టీఎంసీల సంతకం: కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే చాలని కేసీఆర్ సంతకం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాయలసీమకు గోదావరి నీరు: అంతేకాకుండా, సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించుకోవాలని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ సలహా ఇచ్చారని, రాయలసీమను రతనాల సీమ చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని దుయ్యబట్టారు.
చర్చకు రావడం లేదు: కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన ద్రోహంపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ సభకు రావడం లేదని, కేటీఆర్ బయట పబ్లిక్‌గా సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నీటి హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టమని, ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా నీటి వివాదాల నేపథ్యంలో మరింత వేడిని రాజేశాయి.