Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు ఒక ముఖ్యమైన హామీ ఇచ్చారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎస్‌ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్టును పూర్తి చేసి, జిల్లాలోని పొలాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల దేవరకొండ నియోజకవర్గంలో రూ.23 కోట్లతో చేయబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ మాటలు చెప్పారు.
నల్గొండ గడ్డ పోరాటాలకు, పౌరుషానికి ప్రసిద్ధి అని చెబుతూ, ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పదేళ్ల పాటు పాలించిన ప్రభుత్వం పేదలకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త కార్డులు ఇచ్చి, రేషన్ బియ్యంలో మార్పు తెచ్చామని వివరించారు. దొడ్డు బియ్యాన్ని రద్దు చేసి, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, పేదల ఆకలి తీర్చడమే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని తమ ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన గర్వంగా చెప్పారు.
ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడుతూ, యూపీఏ హయాంలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టామని గుర్తు చేశారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రాగానే 4.50 లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేశామని తెలిపారు. అంతేకాక, రైతు రుణమాఫీ విషయంలోనూ గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 25 లక్షల మంది రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.21 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేశామని ప్రకటించారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా కలవకుండా ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యేవారని విమర్శించారు. కానీ, ఇప్పుడు ఇద్దరు సర్పంచులను కూర్చోబెట్టుకుని మంచి రోజుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఓడిపోతేనే రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. చివరగా, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కాంగ్రెస్ మంజూరు చేసినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సొరంగం పనులు మొదలుపెట్టినప్పుడు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే, భారత రాష్ట్ర సమితి నాయకులు సంతోషపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా టన్నెల్‌ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి గట్టి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
