Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్‌ను “మానసిక రోగి”గా అభివర్ణించిన రేవంత్, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం యూరియాను షరతుగా పెట్టడం “పిచ్చికి పరాకాష్ట” అని వ్యాఖ్యానించారు.
యూరియా కేంద్రం ఇస్తుంది… ఈ నాటకం ఎందుకు?
“రైతులకు యూరియా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అలాంటప్పుడు యూరియా ఇస్తేనే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పడం అర్థరహితం. ఈ నాటకాలతో ప్రజలను మోసగించలేరు. మద్దతు ఇవ్వాలనుకుంటే నేరుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నామని చెప్పాలి,” అని రేవంత్ రెడ్డి సూటిగా వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్-BJP గుట్టు విప్పిన రేవంత్
గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి ‘అవయవదానం’ చేసి, ఎనిమిది స్థానాల్లో గెలిపించిందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్‌లో కూడా బీజేపీ గెలవడం బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: ఉగ్రవాదం ఒక్క దేశానికి మాత్రమే కాదు.. మానవత్వానికే ముప్పు
నా మీద 181 కేసులు మెడల్స్
గత ప్రభుత్వ హయాంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని రేవంత్ గుర్తుచేసుకున్నారు. “కేసీఆర్‌కు రాజకీయ ప్రత్యర్థి నేనేనని తెలుసు. అందుకే నాపై అక్రమంగా 181 కేసులు పెట్టారు. ఎన్నికల సమయంలో నా ఇంటిని కూల్చేసి, నన్ను కిడ్నాప్ చేశారు. కానీ ఆ కేసులే నాకు మెడల్స్ అయ్యాయి,” అని ఆయన అన్నారు.
కేంద్ర బిల్లుపై తీవ్ర విమర్శ
30 రోజులకు మించి జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన కేంద్రం బిల్లును కూడా రేవంత్ తప్పుబట్టారు. ఇది విపక్ష సీఎంలను లక్ష్యంగా చేసుకున్న చర్య అని ఆయన విమర్శించారు.
2029లో రాహుల్ ప్రధాని ఖాయం
జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ రేవంత్, “నా అంచనాలు ఎప్పుడూ తప్పవు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయం. ప్రధాని మోదీకి 2029 ఎక్స్‌పైరీ డేట్. ఈ విషయం రాసిపెట్టుకోండి,” అని ధైర్యంగా ప్రకటించారు.
చంద్రబాబు సంప్రదింపుల పుకార్లపై స్పందన
ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబుతో తనకు సంప్రదింపులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. “చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడు. నేను గౌరవిస్తాను. కానీ నా పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం,” అన్నారు. తాను ఏబీవీపీలో పనిచేశానని, కానీ బీజేపీలో ఎప్పుడూ లేనని చెప్పారు. ప్రస్తుతం తాను ‘కాంగ్రెస్ యూనివర్సిటీ’లో ఉన్నానని వ్యాఖ్యానించారు.