Revanth Reddy

Revanth Reddy: కేసీఆర్‌కు అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌పై వరాల జల్లు కురిపించారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని సేవ చేయాలని పిలుపునిచ్చారు. 2025 నూతన సంవత్సరం కానుకగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రత్యేక అభివృద్ధి నిధులను ప్రకటించారు.

గ్రామాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు
పంచాయతీలకు ప్రభుత్వం నుంచి సాధారణంగా వచ్చే నిధులు కాకుండా, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి (CM Fund) నుంచి అదనపు నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. ఈ నిధుల మంజూరులో ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల ప్రమేయం ఉండదని, నేరుగా గ్రామ సమస్యల పరిష్కారానికి వీటిని వాడుకోవచ్చని సూచించారు. దేశ పునాదులు గ్రామాల్లోనే ఉన్నాయన్న గాంధీజీ మాటలను స్మరిస్తూ, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం బాగుపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

కొడంగల్ అభివృద్ధికి పక్కా ప్రణాళిక
కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఒక ‘మోడల్’గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి శపథం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాకు రోడ్లు వేయించడంతో పాటు, నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తన సోదరుడు తిరుపతి రెడ్డిని అందుబాటులో ఉంచానని తెలిపారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

Also Read: Revanth Reddy: ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

కేసీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టి, ఇప్పుడు ‘తోలు తీస్తా’ అనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. “మా తోలు తీయడం కాదు.. గ్రామాల్లో సర్పంచ్‌లే మీ తోలు తీస్తారు” అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారినప్పుడు నోరు విప్పని వారు, ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు.

అసెంబ్లీ వేదికగా సవాల్
నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. 2028లోనూ కాంగ్రెస్ పార్టీ రెండింతల మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు మళ్లీ రానివ్వరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *