Congress: తెలంగాణలో ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం లోతైన విశ్లేషణ మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఘనవిజయం సాధించినప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్‌గా స్పందించారు. ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసం పనిచేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పీసీసీ హెచ్చరించింది.
ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల తీరును నాయకత్వం ఎండగట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలబడిన రెబల్స్‌ను బుజ్జగించడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని పీసీసీ తేల్చింది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ గెలుపు కంటే తమ సొంత బంధువులకు టికెట్లు ఇప్పించుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపించారని, దీనివల్ల పార్టీకి నష్టం జరిగిందని అధిష్టానం మండిపడింది. పాలమూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేల తీరుపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. “మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే ఊరుకునేది లేదు” అని అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు గట్టిగా అక్షింతలు వేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలను తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,702 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8,335 చోట్ల జెండా ఎగురవేసిందని ఆయన ప్రకటించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేసినప్పటికీ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో 87 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని ఆయన గర్వంగా చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడిన కార్యకర్తలను అభినందించారు. ఈ గెలుపు జోష్‌ను ఇలాగే కొనసాగిస్తామని, 2029 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, ఒకవైపు గెలుపు సంబరాలు చేసుకుంటూనే, తప్పులు చేసిన ప్రజాప్రతినిధులను హెచ్చరించడం ద్వారా పార్టీలో క్రమశిక్షణను కాపాడే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.

