Revanth Reddy: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కేవలం వేడుకలు జరుపుకుంటేనే బాధ్యత తీరిపోదని, సమాజంలో మహిళల పట్ల మన దృక్పథం మారాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను సీఎం ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు మహిళల పేరు మీదే ఇస్తున్నామని గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించామని, తద్వారా వారు విద్యుత్ రంగంలో అదానీ, అంబానీ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి కార్యక్రమాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను పెంచాయని ఆయన పేర్కొన్నారు.
పాలనలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) తో పాటు కీలక పదవుల్లో మహిళలు ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా రాణించినప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.
చివరగా, మహిళల రక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం పిలుపునిచ్చారు. కాలేజీలు, బస్టాండ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నేరాన్ని ప్రోత్సహించడమేనని హెచ్చరించారు. వేధింపులకు గురయ్యే మహిళలు ధైర్యంగా ప్రశ్నించాలని, అన్యాయాన్ని ఎదిరించే వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
