CM Revanth

CM Revanth: వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, బస్తీలు నీట మునిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. అమీర్‌పేటలోని మైత్రీవనం, గంగుబాయి బస్తీ, బౌద్ధనగర్ వంటి వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ట్రంక్ లైన్ల నిర్మాణం: మైత్రీవనం, పరిసర ప్రాంతాల్లో వరద ముంపు సమస్యను పరిష్కరించడానికి భారీ ట్రంక్ లైన్లను నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్ నుంచి వచ్చే వరద నీరు భూగర్భ మార్గాల ద్వారా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

నాలాల పునరుద్ధరణ: దశాబ్దాలుగా ఉన్న వరద సమస్యకు కారణమైన నాలాల సామర్థ్యం పెంచాలని, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లను ఆదేశించారు. కాలనీ రోడ్ల కంటే డ్రైనేజీ కాలువలు ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల వరద తీవ్రత పెరుగుతోందని గుర్తించి, వాటిని వెంటనే సరిచేయాలని చెప్పారు.

కుంటల పునరుద్ధరణ: గంగుబాయి బస్తీలోని కుంటను ఆక్రమించి పార్కింగ్ స్థలంగా మార్చారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుంటను అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట మాదిరిగా పునరుద్ధరించాలని, దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని సీఎం సూచించారు.

తన పర్యటనలో ఎటువంటి హడావుడి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో నేరుగా మాట్లాడారు. బౌద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడిని పలకరించి, వరద వల్ల అతని పుస్తకాలు తడిసిపోయినట్లు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఒక మహిళా అభిమాని ఆయనకు రాఖీ కట్టారు.

Also Read: YS Jagan: ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికపై.. స్పందించిన జగన్

అధికారులకు ఆదేశాలు: పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె.ఇలంబర్తి, హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్, ఇతర అధికారులతో కలిసి సీఎం వరద ప్రాంతాలను పరిశీలించారు. ప్యాచ్‌వర్క్‌లతో సమస్య పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారాల కోసం మొత్తం వ్యవస్థను రీడిజైన్ చేయాలని స్పష్టం చేశారు. వెంటనే ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ఈ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. వ్యవసాయశాఖ పురోగతి, సమస్యలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. సిద్దిపేటలోని పామాయిల్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి అనువైన తేదీని ఇవ్వాలని మంత్రి కోరగా, ఈ నెలాఖరులోగా ప్రారంభిద్దామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *