Revanth Reddy

Revanth Reddy: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక.. డీఏ ఫైలుపై సీఎం సంతకం

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పదిన్నర లక్షల మంది ఉద్యోగులే అసలైన సారథులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని, ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) ఫైలుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. కేవలం డీఏ మాత్రమే కాకుండా, ప్రతి ఉద్యోగికి రూ. కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తామని, రిటైర్ అయిన వారికి రావాల్సిన ప్రయోజనాలను కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాల పునర్విభజనపై కీలక అడుగు

రాష్ట్రంలోని జిల్లాల విభజనలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, దీనిని సరిచేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై సమగ్రంగా చర్చించి, ముందుగా మండలాల స్థాయి నుంచి మార్పులు చేపడతామన్నారు. పాలనలో పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని, సరిహద్దుల విషయంలో ప్రజలకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Traffic Rush: భోగికి ముందే రోడ్లపై సెగలు.. విజయవాడ హైవేపై వాహనాల వెల్లువ!

ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ తీరుపై సీఎం ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సమస్యలపై పెద్దదిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. తాను రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా సమస్యలు పరిష్కరించడానికి సమయం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని, కానీ తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యోగ సంఘాలకు భారీ భరోసా

ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని, భవనం కోసం సంఘం ఎంత నిధులు సేకరిస్తే, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని గ్రాంట్‌గా ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల కష్టసుఖాల్లో ప్రభుత్వం తోడుంటుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *