Revanth Reddy

Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి ఇక అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్ కుటుంబానికి మళ్ళీ అధికారం దక్కనివ్వనని భీకరమైన శపథం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన సర్పంచుల సన్మాన సభలో పాల్గొన్న సీఎం, కేసీఆర్ గత పదేళ్ల పాలనను, ప్రస్తుత తీరును తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ మాటల్లో సోయి లేదని, ఆయన చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

గతంలో కేసీఆర్ తనను, తన కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని రేవంత్ గుర్తుచేసుకున్నారు. పగ సాధిస్తే రాష్ట్ర ప్రగతి ఆగిపోతుందన్న ఉద్దేశంతోనే తాను మౌనంగా ఉన్నానని, కానీ కేసీఆర్ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. “నన్ను గెలికితే మర్యాదగా ఉండదు” అని హెచ్చరించిన సీఎం.. తాను సామాన్య స్థాయి నుంచి ఎదిగి ఇక్కడి దాకా వచ్చానని, కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్‌లో పోలీసుల మధ్య బందీగా ఉన్నారని, జైలుకు వెళ్లినా ఆయన పరిస్థితి మారదని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఒకవేళ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినా.. వందకు పైగా సీట్లు గెలుచుకుంటామని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర ముగిసిపోయిందని, తెలంగాణ భవిష్యత్తు కేవలం కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాజకీయ భవిష్యత్తు లేదని, ఇది కొడంగల్ బిడ్డగా తాను చేస్తున్న ప్రమాణమని గంభీరంగా ప్రకటించారు.

చివరగా, కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ సవాల్ చేశారు. కేవలం ఫామ్ హౌస్‌లో కూర్చుని మాట్లాడటం లేదా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టడం కాదని, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని విషయాలపై తేల్చుకుందామని, ప్రజల ముందే చర్చ జరగాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *