Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భూమి పంపిణీలో కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తుచేస్తూనే, గత ప్రభుత్వం అమలు చేసిన ‘ధరణి’ విధానం, నిరుద్యోగుల పట్ల వారి వైఖరిని ఆయన పదునైన పదజాలంతో ఎండగట్టారు.
25 లక్షల ఎకరాల చరిత్ర మాది!
భూ సమస్యలు, వాటి పరిష్కారంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, “25 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది” అని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసమే తమ ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకువచ్చిందని గుర్తుచేశారు.
అయితే, ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ధరణి చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది” అంటూ ఆరోపించారు. ధరణి అనేది ఒక “దరిద్రం” అని అభివర్ణించిన ఆయన, “ధరణి అనే దరిద్రం ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టడానికి కారణమైంది” అంటూ గతంలో జరిగిన ఘోర సంఘటనను ప్రస్తావించారు. భూమి విషయంలో పేద ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఈ వ్యవస్థే కారణమని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగాల వైఫల్యంపై నిప్పులు
ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. “వారి ఇంట్లో నియామకాలు చేశారు కానీ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను మాత్రం నింపలేదు” అంటూ పరోక్షంగా గత పాలకులపై విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Salman Khurshid: సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జరిగిన అన్యాయాలను ఆయన ఎత్తిచూపారు. “నోటిఫికేషన్లు ఇవ్వరు. ఇచ్చినా పరీక్షలు పెట్టరు. ఒకే వేళ పరీక్షలు పెడితే, ఆ పేపర్లు జిరాక్స్ సెంటర్లో దర్శనమిచ్చేవి” అంటూ గతంలో జరిగిన పేపర్ లీకేజీల వ్యవహారాన్ని ప్రస్తావించారు.
60 వేల ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం ధీమా
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల పక్షాన నిలబడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “అధికారంలోకి వచ్చిన వెంటనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం” అని తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేశారు.
ముఖ్యంగా గ్రూప్-1 నియామక ప్రక్రియ విషయంలో గత ప్రభుత్వం చేసిన అడ్డంకులను తాము అధిగమించామని తెలిపారు. “గ్రూప్-1 ఉద్యోగాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్లాడి గ్రూప్-1 విజేతలకు నియామకపత్రాలు ఇచ్చాం” అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమి, ఉద్యోగ సమస్యలపై తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.