Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై వివరణ ఇచ్చారు. “ఢిల్లీకి వెళ్లడం తప్పా? రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి వెళ్లకపోతే, ఫామ్ హౌస్‌కి వెళ్లాలా?” అని ఆయన ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా పనిచేస్తున్నానని రేవంత్ స్పష్టం చేశారు. “గత ప్రభుత్వం సాధించలేని చాలా విషయాలు, నేను సాధించాను. కేంద్రంతో చర్చించాల్సిన విషయాలను ఢిల్లీలోనే మాట్లాడాలి. నాకు ఎవరికి భయపడే అలవాటు లేదు” అని ఆయన తేల్చి చెప్పారు. త్వరలో మహారాష్ట్ర వెళ్లి నీటి ప్రాజెక్టులపై చర్చిస్తానని తెలిపారు.
డ్రగ్స్ కేసులో కేటీఆర్ పై సూటి ప్రశ్నలు
డ్రగ్స్ టెస్టుల విషయంలో కేటీఆర్ సవాల్‌ను గుర్తుచేస్తూ రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. మేము గన్‌పార్క్‌కి వెళ్లి టెస్టులు చేయడానికి సిద్ధమయ్యాం, కానీ కేటీఆర్ కోర్టులో స్టే తెచ్చుకున్నారు. దుబాయ్‌లో కేటీఆర్ మిత్రుడు కేదార్ డ్రగ్స్‌తో చనిపోయాడు. కేటీఆర్ బామ్మర్ది, కేదార్ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేశారు అని ఆరోపించారు. నేను తెరిచిన పుస్తకం లాంటివాడిని, ఎప్పుడైనా టెస్టులకు సిద్ధమే.
ఇది కూడా చదవండి: Revanth Reddy: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేత
గత ప్రభుత్వ అవినీతి విచారణ
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అవినీతి కేసులపై దృష్టి పెట్టామని చెప్పారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, హెచ్ఎండిఏ అవినీతి కేసులు విచారణలో ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. విలన్లు ఎప్పుడూ క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టం అని హెచ్చరించారు. కేంద్రం ప్రభాకర్ రావును ఆలస్యంగా తీసుకురావడమే విచారణ ఆలస్యానికి కారణం అన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
కేసీఆర్‌ను కాపాడేందుకే కిషన్ రెడ్డి తాపత్రయం పడుతున్నారు. లోకేష్‌ను కేటీఆర్ ఎందుకు రహస్యంగా కలిశారు? అర్ధరాత్రి డిన్నర్ మీటింగ్ ఎందుకు జరిగింది?” అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేశారు.