Nirmala Sitharaman

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ పేరుతో భారీ మోసం.. రూ.కోటిన్నర కి టోపీ.. ఎలాగంటే..?

Nirmala Sitharaman: ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకున్న ఒక సంచలనాత్మక సైబర్ మోసం ఘటన, సైబర్ నేరగాళ్ల తెగువకు, వారి మోసపు వ్యూహాలకు అద్దం పడుతోంది. ఎంతో తెలివైన వారినైనా సులభంగా బురిడీ కొట్టించే ఈ సైబర్ క్రిమినల్స్, ఏకంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి నుంచి కోటి 47 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఈ మోసానికి విశ్వసనీయత కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను వాడుకోవడం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.

పెట్టుబడిపై ఆశ.. బురిడీ కొట్టించిన యాడ్

సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిగా సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటారో ఈ ఘటన స్పష్టం చేస్తుంది.బాధితుడు ఫేస్‌బుక్‌లో కనిపించిన ఒక ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. కేవలం రూ.21 వేల పెట్టుబడికి రూ.60 వేల లాభం వస్తుందనే ఆశ చూపే ఆ యాడ్ లింక్‌ను క్లిక్ చేయడంతో మోసపు ఉచ్చులో పడ్డాడు.వ్యక్తిగత వివరాలు నమోదు చేయగానే, ‘మీనాక్షి’ అనే పేరుతో ఒక మహిళ వాట్సాప్ కాల్ చేసింది. ఆమె తాను అప్‌స్టాక్స్ (Upstox) సెక్యూరిటీస్‌కు చెందిన ప్రతినిధి అని నమ్మబలికింది.

ఆమె సూచనల మేరకు, బాధితుడు మార్కెట్‌లో లేని ఫేక్ కంపెనీలు, స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు నమ్మారు. ముఖ్యంగా ఎస్‌బీఐ వెల్త్ మైండ్‌సెట్, సేవెక్సా (Savexa) స్కీమ్‌లు, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ ఐపీఓ వంటి వాటిలో పెట్టుబడి పెడుతున్నట్లు చూపించారు. ఈ నమ్మకంతో రిటైర్డ్ ఉద్యోగి విడతలవారీగా ఏకంగా రూ.1.47 కోట్లు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేశాడు.

రూ.6 కోట్ల లాభం.. చివరకు సున్నా

బాధితుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత, స్కామర్‌లు చూపించిన డ్యాష్‌బోర్డులో తన పెట్టుబడిపై ఏకంగా రూ.6 కోట్లు లాభం వచ్చినట్లు చూపించింది. ఈ భారీ లాభాన్ని చూసి నిజమని నమ్మిన బాధితుడు, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా అసలు నాటకం మొదలైంది.

ఇది కూడా చదవండి: Netflix: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ షాక్..?

లాభాలు విత్‌డ్రా చేయాలంటే, ముందుగా రూ.90 లక్షలు ‘గ్యారంటీ ఫీజు’ కింద చెల్లించాలని సైబర్ క్రిమినల్స్ డిమాండ్ చేశారు.ఈ డిమాండ్‌తో అనుమానం వచ్చి, తాను మోసపోయానని బాధితుడు గుర్తించాడు. వెంటనే ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖుల ఫోటోలతో నమ్మించి దోపిడీ: పోలీసుల హెచ్చరిక

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, సైబర్ క్రిమినల్స్ ఒక సిండికేట్‌గా ఏర్పడి, నకిలీ కంపెనీలు, వెబ్‌సైట్‌లను చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తమ మోసాలకు విశ్వసనీయత కల్పించేందుకు, ఈ స్కామర్‌లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను వాడుకున్నారని పోలీసులు నిర్ధారించారు.

ఇలాంటి డీప్ ఫేక్, ఏఐ ఆధారిత మోసాలు (AI-driven Frauds) పెరుగుతున్న నేపథ్యంలో, మంత్రి నిర్మలా సీతారామన్ సైతం గతంలో ప్రజలను హెచ్చరించారు. ప్రముఖుల ఫోటోలు, వాయిస్‌లు, నకిలీ వీడియోలను ఉపయోగించి మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

SEBI మరియు NPCI లు సంయుక్తంగా ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక UPI హ్యాండిల్స్‌ను ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వ్యక్తిగత జాగ్రత్త అత్యవసరం. తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపేవారి పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా మరోసారి ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *