Bharati Builders

Bharati Builders: భారతి బిల్డర్స్‌కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!

Bharati Builders: రియల్ ఎస్టేట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను భారతి బిల్డర్స్‌ (Bharathi Builders) సంస్థపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) కఠిన చర్యలు తీసుకుంది. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ‘భారతి లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్’ ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడినందుకు బిల్డర్‌కు రూ. 4.74 కోట్ల భారీ జరిమానా విధించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రీ-లాంచ్ పేరిట కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఈ తీర్పు వెలువరించింది.

ప్రీ-లాంచ్ పేరుతో నిధుల సేకరణ

సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు రెరా అనుమతులు పొందడం తప్పనిసరి. కానీ భారతి బిల్డర్స్ ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే కొనుగోలుదారుల నుండి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.

ప్రాజెక్టుకు అనుమతులు రాకముందే ఫ్లాట్లు విక్రయించడం, కస్టమర్ల నుండి డబ్బులు తీసుకోవడం రెరా చట్టం ప్రకారం నేరం.

నిబంధనలను బేఖాతరు చేసినందుకు భారతి బిల్డర్స్‌ను ‘డిఫాల్టర్ ప్రమోటర్‌’ గా రెరా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

60 రోజుల్లోపు డబ్బులు వాపసు ఇవ్వాలి

ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వారికి రెరా భారీ ఉపశమనం కలిగించింది. బిల్డర్ బాధితులకు చెల్లించాల్సిన వివరాలను కోర్టు స్పష్టంగా పేర్కొంది.

కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. కేవలం అసలు మాత్రమే కాకుండా, నిబంధనల ప్రకారం వడ్డీని కూడా కలిపి బాధితులకు చెల్లించాలి. ఈ ప్రక్రియ అంతా 60 రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఒకవేళ నిర్దేశించిన సమయంలోగా డబ్బులు చెల్లించకపోతే బిల్డర్‌పై మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెరా స్పష్టం చేసింది.

కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరిట జరుగుతున్న మోసాల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ ప్రాజెక్టులోనైనా డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు సదరు బిల్డర్‌కు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని కోరారు. భారతి బిల్డర్స్‌పై తీసుకున్న ఈ చర్య ఇతర బిల్డర్లకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *